Saturday, December 24, 2011

రవీంద్రుని కవితా గుళికలు



ఆధునిక భారతీయ కవితా చక్రవర్తి శ్రీ రవీంద్రనాథ్ ఠాగూరు గురుదేవులు సాహితీమతల్లి పాదాలకు సమర్పించిన పుష్పాంజలులెన్నో. అందులో సుమాలు కొన్ని ఏరుకొని నా మనసుకు అందిన భావాన్ని నా మాతృభాషలో అనువదించి మీముందుంచుతున్నాను. పిట్ట కొంచెం, కూత ఘనం లాగా ఇవి గుళికలే అయినా, అవి సృజించే భావనా పరంపరలు అనంతం. సాహితీ మిత్రులు ఆ భావాల సౌరభాన్ని ఆస్వాదించి ఆనందిస్తారని ఆశిస్తున్నాను.

1.      నిరంతరం ప్రశ్నించే
సాగర ఘోషకు
               నిరంతర మౌనమే
                             ఆ నిశీధి సమాధానం

2.      నేనున్నాననే
నిరంతర ఆశ్చర్యమే జీవితం

3.      మానవుడో పసిపాప
ఎదగడమే అతని శక్తి

4.      ఓటమి -
అంగీకరించదు అధర్మం
ధర్మం దాన్ని సహిస్తుంది
5.      అసాధ్యం -
చేతకానివాని కలల సౌధం

6.      వేర్లు –
భూమిలో విస్తరించిన శాఖలు
              శాఖలు –
                   బాహ్యంలో విస్తరించిన వేర్లు

7.      జీవితపు పగుళ్ళగుండా
ప్రవహిస్తుంది మృత్యుగీతం

8.      నీ అలలను భరించలేనని
తిరిగి నెట్టివేస్తుంది తీరం
               అయినా,
                   నీ పాదముద్రలను
                   మదిలో దాచుకొంటోంది కడలి

9.      దేవతా పుష్పాలు
కాంతిని ముద్దాడిన నీలిమేఘాలు

10.  దీపాలు వెనుక పెట్టుకొని నడిచేవాళ్ళు
వాళ్ళ నీడల్ని ముందు పరుస్తారు

11.  తూర్పునకు
అంతిమ వందనం చేయడానికి
               సూరీడు
                   పశ్చిమ సంద్రందాటి వెళ్ళాడు

12.  స్వర్గంలోకి తొంగి చూచేందుకు
భువి చేసే ప్రయత్నం
               నిటారుగా నింగి కెగసిన చెట్లు

13.  భగవంతుడు –
-      ఆదరించేందుకే బాధిస్తాడు
-      ప్రేమించేందుకే శిక్షిస్తాడు
14.  పాతివ్రత్యం
అపరిమిత ప్రేమాంకురం

15.  నిశీధిలో నమ్రతగా
నిలిచింది మబ్బుతునక ఓ మూలగా
               ప్రాభాతం దాన్ని
                   అలంకరిస్తోంది వైభవంగా
         
16.  సూర్యకాంతి చిరునవ్వుతో పలుకరిస్తే
అతని సోదరి వర్షం
     నా మనసుతో మాటాడుతోంది

17.  హృదయమా నిశ్చలంగా కూర్చో
                             దుమ్మురేపబోకు
               ప్రపంచాన్ని నీ దరికి రానీ

18.  సూరీడు పశ్చిమానికి వెళ్ళినా
తూరుపు అతని ముందు
నిలుస్తుంది మౌనంగా

19.  చీకటి మూటనుండి
భళ్ళున వెలసిందీ
స్వర్ణకాంతులీనుతూ ప్రాభాతం

20.  తన ప్రేమను భువి తిరస్కరించిందన్న
ఓ దేవత ఆక్రందనే తుఫాను

21.  జీవిత గమనం
తన స్వ సంగీతంలో
విశ్రమిస్తుంది

22.  బంగరు రెక్కలు తొడిగిన పక్షి
నింగికెగుర లేదన్నడూ

23.  అంతా వెలుగు పంచే చందమామ
మచ్చలు మాత్రం తనలోనే దాచుకొంది

24.  అసత్యం
ఎంత శక్తిని సమీకరించినా
సత్యం కాజాలదు

25.  బాట పక్కని గడ్డి పరకా
తారలని ప్రేమించు
నీ కలలు సుమాలుగా ఫలిస్తాయి

26.  రాలుతోన్న
ఈ చెట్టు ఆకులు
               పసిపిల్లల వేళ్ళలా
                   నా మనసును స్పృశిస్తున్నాయి

27.  సీతాకోకచిలుకలా
ఎగిరిపోవాలనుకొన్న
               ఈ చిన్ని కుసుమం
                             నేలరాలింది.

28.  నిన్ను నా ఇంటికి
ఆహ్వానింపను
               నా అపరిమిత ఏకాంతంలోకి రా సఖా

29.  మరణంకూడా
జీవితానుబంధమే
జననంలా
               నడక అంటే
                   పాదం ఎత్తడమే కాదు
                   ఎత్తిన పాదాన్ని నేలమోపడం కూడా

30.  అమ్మా! భూ మాతా!
నీ తీరానికి వచ్చా
              ఓ అపరిచితునిలా
నీ ఇంట నివసించా
              ఓ అతిథిలా
నీ వాకిలి వీడిపోతా
              ఓ స్నేహితునిలా

31.  చీకటిలో
                   చంటి బిడ్డను నేను
              చీకటి దుప్పటిలోంచి
                   అమ్మ కోసం చేయి చాపుతూ

32.  పని ముగిసింది
అమ్మా!
నీ చేతులలో
నా ముఖం దాచుకోనీ
కలలు కననీ

33.  అమృతం నిండిన పాత్రలా
పరిపూర్ణమైన ప్రేమే జీవితం

34.  చీకటి గమనం వెలుగు కోసమే
కాని,
అంధత్వపు గమనం
మృత్యు సమ్ముఖానికే

35.  రేయిలో బాటను
స్మృతుల పద ఘట్టనలు
మౌనంగా వింటూ

36.  వానజాడ లేని వేసవిని
పక్వానికొచ్చిన వరిచేల పూర్ణత్వాన్ని

37.  మలి సంధ్యలో
నా మౌన గూటికి చేరిందొక
తొలి సంధ్యావిహంగం

38.  నా అంతరంగాన్ని
ముద్దాడిందీ ప్రపంచం తన బాధతో
                   పాటల ప్రతిఫలాన్ని కోరుతూ

39.  సాయంత్రపు ఆకాశం
నా కొక గవాక్షం
ఓ వెలుగు దివ్వె
దాగిన నిరీక్షణ
40.  వెన్నెల
భానుడు రేయికి పంపిన
ప్రేమలేఖ
               గడ్డిపరకపైని మంచు ముత్యాలు
                   ఆరేయి సిగ్గుతో వ్రాసిన జవాబులు

41.   నిదుర
మౌనంగా బాధననుభవించే భర్త
                కల
                   ఆ మౌనాన్ని భంగం చేసే భార్య
                            

Sunday, December 18, 2011

కృష్ణా వందనం

 
కృష్ణా వందనం                                            
        యశోద తనయా వందనం            
కృష్ణా వందనం
        యదుకుల తిలకా వందనం

వంశీ మోహనం
        మృదుపద కేళీ నర్తనం
గానరవామృతం
        కుసుమ విలాస వినోదనం

కాళీయ మర్ధనం
        గోవర్ధనోద్ధారకం
కంస నిషూదనం
        ద్రౌపదీ మానరక్షకం

పూతనాస్తన పీడకం
        ధేనుకాసుర నాశకం
శకటాసుర భంజనం
        గోపికా జన రంజకం

అక్రూర వర సేవితం
        అభయ ప్రద మార్జునం
విదుర ప్రపూజితం
        విబుధ జన రక్షకం

ఉపనిషత్సారానుబోధితం
        సాధు పరిత్రాణాయనం
దుర్జన భయంకరం
        బృందావన సంచారిణం